TICKER

Date loading... 00:00:00
MK NEWS
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

మంటలు రేపుతున్న కూరగాయల ధరలు...సంత కాదు... సామాన్య ప్రజలకు చింత


మహా క్రాంతి-అశ్వాపురం :

నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజలకు కూరగాయల ధరలు మరింత భారంగా మారుతున్నాయి. కూరగాయలు కొనాలంటేనే జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అశ్వాపురం మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే వారపు సంతలో కూరగాయల ధరలు మండిపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. సంతకు వచ్చి కూరగాయల ధరలు అడుగుతున్న ప్రజలు, ధరలు విన్న తర్వాత కొనుగోలు చేయకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

సోమవారం నిర్వహించిన వారపు సంతలో కూరగాయల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. బెండకాయలు కిలో రూ.80, కాకరకాయలు రూ.80, గోరుచిక్కుడు కాయలు రూ.80, ఉల్లిగడ్డలు రూ.70, క్యాప్సికం కిలో రూ.120 చొప్పున విక్రయించారు. ఇలా ఏ కూరగాయను చూసినా కిలో రూ.70 నుంచి రూ.80కి పైగా ధర పలుకుతుండగా, కొన్ని రకాల కూరగాయల ధరలు రూ.100 దాటడం గమనార్హం. దీంతో వారపు సంతలో కొనుగోలుదారుల కంటే ధరలు చూసి వెనుదిరిగే వారే ఎక్కువగా కనిపించారు.

దినసరి కూలీలకు భారంగా మారిన కూరగాయల ధరలు..!

రెక్కాడితే గానీ డొక్కాడని దినసరి కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోజంతా కష్టపడి పనిచేస్తే వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవడం, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర అవసరాలు తీర్చుకోవడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతుండటంతో కుటుంబానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేయలేకపోతున్నామని సామాన్య ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మండుతున్న ఈ ధరల కారణంగా ప్రస్తుతం అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు.

ఒకవైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు పెట్రోల్, గ్యాస్, విద్యుత్ బిల్లుల భారం సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నాయని ప్రజలు అంటున్నారు. దీనికి తోడు కూరగాయల ధరలు కూడా పెరగడంతో నెలవారీ కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోందని పలువురు చెబుతున్నారు. ఈ పెరిగిన నిత్యవసర ధరలతో ముఖ్యంగా తక్కువ ఆదాయంతో జీవనం సాగించే పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

అధికారుల పర్యవేక్షణ అవసరం అంటున్న జనం :

వారపు సంతల్లో కూరగాయల ధరలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు. ధరల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు, మార్కెట్‌లో అనవసర ధరల పెరుగుదలకు తావులేకుండా పర్యవేక్షణ చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా, వినియోగదారులకు సరసమైన ధరలకు కూరగాయలు అందేలా మార్కెటింగ్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని నిరుపేద కుటుంబాల వారు సూచిస్తున్నారు.

మొత్తానికి అశ్వాపురం సోమవారం సంతలో కూరగాయల ధరలు సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. వారానికి ఒకసారి జరిగే సంతలో కుటుంబానికి కావాల్సిన కూరగాయలు కొనుగోలు చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రజలకు నిత్యావసరమైన కూరగాయలు సైతం విలాసవంతమైన వస్తువులుగా మారితే పేద కుటుంబాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు.

సంతకు వెళ్తే సంచి నిండా కూరగాయలు తెచ్చుకునే రోజులు పోయి... ధరలు చూసి ఖాళీ సంచులతో ఇంటికి వెళ్లే రోజులు వచ్చాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పాటు సంబంధిత శాఖల అధికారులు నిత్యవసరాలు కూరగాయల ధరలపై దృష్టి సారించి చర్యలు చేపట్టకపోతే సామాన్య ప్రజలు పచ్చడమెతుకులకే పరిమితమయ్యే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.

Post a Comment

0 Comments