అశ్వాపురం-మహా క్రాంతి :
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లలో వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలుగా ఉన్న వారికి ప్రభుత్వం చేయూత పెన్షన్లు మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం అశ్వాపురం తహసిల్దార్ కార్యాలయం వద్ద పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు, హెల్పర్లలో వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అర్హులైన వారికి చేయూత పింఛన్లు మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్, సీపీఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్, ఏఐటీయూసీ అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి రెడ్డి అరుణ, మన్నెం చిట్టి, కళావతి, పుల్లమ్మ, సుమతి, సుగుణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

0 Comments