మహా క్రాంతి-అశ్వాపురం :
రహదారులపై వాహనాల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు ఏర్పాటు చేయాల్సిన రక్షణ చర్యలే కొరవడితే ప్రయాణం ప్రమాదకరంగా మారుతుందని వాహనదారులు అంటున్నారు. అశ్వాపురం మండల కేంద్రంలో రహదారిపై నిర్మించిన డివైడర్ వాహనదారులకు భద్రత కల్పించాల్సింది పోయి ప్రమాదాలకు కారణమవుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డివైడర్ నిర్మాణం చేపట్టిన అధికారులు దానికి అవసరమైన ప్రమాద సూచికలు, రేడియం స్టిక్కర్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడాన్ని విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సూచికలు లేక.. తరచూ జరుగుతున్న ప్రమాదాలు :
డివైడర్ నిర్మాణం పూర్తయినప్పటికీ రాత్రి వేళల్లో అది వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా ఎలాంటి ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుగులో డివైడర్ సరిగా కనిపించకపోవడంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారని వారు చెబుతున్నారు. కొత్తగా ఆ మార్గంలో ప్రయాణించే వారికి డివైడర్ ఎక్కడ ప్రారంభమవుతుందో, ఎక్కడ ముగుస్తుందనే విషయం ముందుగా తెలియకపోవడం ప్రమాదాలు జరగడానికి కారణమని స్థానికులు అంటున్నారు.
తరచూ ప్రమాదాలు.. ఆందోళనలో ప్రజలు :
అశ్వాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి కార్యాలయం నుండి డిసిసిబి బ్యాంకు వరకు నిర్మాణం చేపట్టిన డివైడర్ వద్ద తరచూగా ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు, వాహనదారులు అంటున్నారు. అనునిత్యం ఈ మార్గం గుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, ఆటో ప్రయాణికులు, ఇతర వాహనాల డ్రైవర్లు ప్రమాదాల ముప్పును ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు తెచ్చే పరిస్థితులు ఉన్నాయని పలువురు వాహనదారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టే రక్షణ చర్యలకంటే ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం అధికారుల బాధ్యత అని ప్రజలు గుర్తుచేస్తున్నారు.
ఆర్ అండ్ బి శాఖ స్పందించాలంటూ జనం :
డివైడర్ నిర్మాణ పనులు చేపట్టిన సమయంలోనే రహదారి భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించాల్సి ఉన్నప్పటికీ, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడం అధికారుల పనితీరుపై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి శాఖ అధికారులు స్పందించి డివైడర్ ప్రారంభం నుండి ముగింపు ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రేడియం స్టిక్కర్లు, రిఫ్లెక్టర్లు అమర్చాలని వాహనదారులు కోరుతున్నారు. అవసరమైన చోట్ల రాత్రివేళల్లో కనిపించేలా బ్లింకింగ్ లైట్లు, రహదారి మార్కింగ్లు ఏర్పాటు చేయాలని కోరున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి అశ్వాపురం మండల కేంద్రంలోని ఈ డివైడర్ పై జరుగుతున్న ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

0 Comments